ఇంకుడు గుంత ఉంటేనే నల్లా కనెక్షన్..ఓఆర్ఆర్ విలీన ప్రాంతాల్లో  వాటర్బోర్డు కొత్త రూల్

ఇంకుడు గుంత ఉంటేనే నల్లా కనెక్షన్..ఓఆర్ఆర్ విలీన ప్రాంతాల్లో  వాటర్బోర్డు కొత్త రూల్
  •  3  నెలల్లో 18 వేల గుంతలు టార్గెట్​ 

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: ఔటర్​పరిధిలోని విలీన ప్రాంతాల్లో కొత్త వాటర్​కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకునేలా అధికారులు ప్లాన్​చేస్తున్నారు. దీని కోసం కనెక్షన్ కావాలంటే తప్పనిసరిగా ఇంకుడు గుంత ఉండాల్సిందేనని రూల్​పెట్టారు.

గ్రేటర్​ లో 1,450 చ. కి.మీ. పరిధిలో నీటి సరఫరా చేస్తున్న బోర్డు పరిధిలోకి ఓఆర్ఆర్ వెలుపలి ప్రాంతాలను విలీనం చేయడంతో దాదాపు 603 చ. కి.మీ పెరిగింది. దీంతో ఇప్పటి వరకూ నల్లా కనెక్షన్లు లేనివారంతా కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. బోర్డు పరిధిలో నెలకు 4 వేల దరఖాస్తులు వస్తుండగా, కేవలం విలీన ప్రాంతాల నుంచే 2వేలకు పైగా అప్లికేషన్లు వస్తున్నాయి.

దీంతో కొత్త కనెక్షన్​ కావాలంటే తప్పని సరిగా ఇంకుడు గుంత ఉండాల్సిందేనన్న నిబంధన విధించారు. కానీ, దీన్ని 200 చ.గజాలు ఆపైన నిర్మించుకునే ఇండ్లకు మాత్రమే వర్తింపజేస్తున్నారు.

ఓఆర్​ఆర్​ వెలుపలి ప్రాంతాల్లో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటుతున్నట్టు నివేదికలు రావడంతో  ఈ నిబంధన తీసుకువచ్చారు. వచ్చే వర్షాకాలం నాటికైనా ఆయా ప్రాంతాల్లో భూగర్భ నీటి నిల్వలు పెంచాలని చూస్తున్నారు. 

ఒక్కో ఆఫీసర్​ టార్గెట్ ​2 వేలు..

ఓఆర్ఆర్​పరిధిలోని ప్రాంతాల్లో 90 రోజుల్లో 18 వేల ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని అధికారులకు టార్గెట్​ విధించారు. ఆయా ప్రాంతాల్లో నియమితులైన ఒక్కో నోడల్ ఆఫీసర్ 2 వేల ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్లాన్​రూపొందించుకోవాలని అధికారులకు బోర్డు ఎండీ అశోక్​ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇంకుడు గుంత లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో కనెక్షన్​ ఇవ్వకూడదని నిర్ణయించారు.